తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ (Medak) జిల్లాకు వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే.. ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు నిరసన బాట పట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడికి బీజేపీ (BJP) రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో.. బుధవారం ఉదయాన్నే పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాకు దిగారు. అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ (KCR) కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు. విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అక్కడకు చేరుకుని నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. డీఎస్పీ తమను దూషించారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొందరు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు నాగర్ కర్నూల్ (Nagarkurnool) లోనూ ధర్నాకు దిగారు బీజేపీ శ్రేణులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ ఉండడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు కార్యకర్తలు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ఎన్నికల స్టంట్ లో భాగమేనని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఏ ఒక్క పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారని బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించారు. ప్రభుత్వానికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, పోలీసు వ్యవస్థ ద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మహిళా జాతిని అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.