బీజేపీ అగ్రనేత, కురువృద్ధుడు ఎల్కే అద్వానీ (LK Advani)కి భారత అత్యున్నత పురస్కారం లభించింది. ఎల్కే అద్వానీకి భారత రత్న (Bharat Ratna)ను కేంద్రం ప్రకటించింది. ఈ సందర్బంగా అద్వానీ ప్రధాని మోడీ ఫోన్ చేశారు. భారత రత్న ప్రకటించిన విషయాన్ని అద్వానీకి మోడీ తెలియజేశారు. అనంతరం ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎల్కే అద్వానీజీకి భారతరత్న ప్రకటించామనే విషయాన్ని అందరితో పంచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ గొప్ప గౌరవం దక్కిన సందర్భంగా అద్వానీతో తాను మాట్లాడానని చెప్పారు. అద్వానీజీకి ఈ సందర్బంగా అభినందించానని పేర్కొన్నారు. అద్వాణీకి భారత రత్న ప్రకటించడం తనకు ఉద్వేగ భరితమైన సమయమని చెప్పారు.
మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరని వెల్లడించారు. భారత అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమని చెప్పారు. అతని పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శ ప్రాయమన్నారు.
ప్రజా జీవితంలో అద్వానీ సుదీర్ఘంగా పారదర్శకత, సమగ్రతతో సేవలందించారని… జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించేందుకు ఆయన అసమానమైన కృషి చేశారని కొనియాడారు. అద్వానీతో సంభాషించడానికి, ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకునేందుకు తనకు లెక్కలేన్ని అవకాశాలు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు.