పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ అధికారం లేకుండా ఉండలేకపోతుందన్నారు. దేశంలో ఆ పార్టీకి సానుకూలత లేదని తెలిపారు.. రాహుల్ ఎక్కడ జోడో యాత్ర చేస్తే అక్కడ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేశారని విమర్శించారు..
రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి, నరేంద్ర మోడీ (Narendra Modi)కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపిన కిషన్ రెడ్డి.. తప్పుడు ఆరోపణలతో బీజేపీకి అవినీతిని అంటగట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.. మోడీ ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తుంటే.. కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు.. అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ గ్లోబల్స్ కు మించి దుర్మార్గమైన ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు..
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్న రేవంత్.. బీజేపీ, బీఆర్ఎస్ ఎక్కడ ఒక్కటయ్యాయో సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు.. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేస్తే వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరమని కిషన్ రెడ్డి అన్నారు.. బీజేపీ పాలనలో చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లకు పెద్ద పీట వేసిందని తెలిపారు..
సిద్దిపేటలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేసి కాంగ్రెస్ తన ఆఫీసియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు.. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశామని వివరించారు.. కాంగ్రెస్ తరుపున వెళ్లి ప్రజలకు ఏం చెప్పాలో రేవంత్ రెడ్డికి తెలియడం లేదని ఆరోపించారు.. సోనియా జన్మదినం డిసెంబర్ 9న రుణ మాఫి చేస్తామని మాట ఇచ్చి తప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు..
ఒట్లు పెట్టడం, ప్రమాణాలు చేయడం వల్ల ప్రజల బ్రతుకుల్లో మార్పు రాదని తెలిపిన కిషన్ రెడ్డి (Kishan Reddy).. కాంగ్రెస్ (Congress)కు వంద రోజులంటే ఎన్ని రోజులో చెప్పాలని ప్రశ్నించారు. చేతనైతే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతే గద్దె దిగాలని సవాల్ విసిరారు.. ఆయన చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలన్నారు..