ఇందిరా పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు దీక్షా శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీక్షకు ఆరు గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. కానీ 24 గంటల పాటు దీక్షను జరిపి తీరుతామని బీజేపీ నేతలు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
పోలీసులను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కింద పడిపోయారు. వెంటనే కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాటలో పలువురు బీజేపీ నేతలు, మహిళా కార్యకర్తలు కింద పడిపోయారు.
దీంతో వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. తోపులాటలో పలువురు మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారు. కిషన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఇందిరా పార్కు మొత్తం బీజేపీ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లితోంది. దీంతో దీక్షా శిబిరంలో అంతా గందరగోళంగా మారింది. మరోవైపు కిషన్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ని రకాలుగా కుట్రలు పన్నినా తన దీక్ష కొనసాగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. తాము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులకు ఏం ఇబ్బంది కలుగుతోందని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.