-బీజేపీకి 370, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు
-ఊహకందని లక్ష్యాలను పూర్తి చేశారు
-దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు
-మూడవ సారి మోడీని పీఎం చేయండి
-మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం
-కేంద్ర హోం అమిత్ షా వెల్లడి
రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 370కు పైగా సీట్లు వస్తాయని, ఎన్‌డీఏ 400కు పైగా సీట్లను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎలాంటి సస్పెన్స్ లేదని వెల్లడించారు.
ప్రధాని మోడీ పదేండ్ల పాలనలో మొదటి ఐదేండ్లు కాంగ్రెస్ తవ్విన గొయ్యిని పూడ్చేందుకు సరిపోయిందని, మరో ఐదేండ్లు ఇప్పుడు అభివృద్ధికి పునాది వేసేందుకు కావాలన్నారు. గుజరాత్‌లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో రూ. 1,950 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను అమిత్ షా ప్రారంభించారు.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ….ప్రధాని మోడీని మూడవ సారి ప్రధానిగా చేయాలని కోరారు. అలా చేస్తే అభివృద్ది అనే భవనం అత్యంత తొందరగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. తాను ఆదివారం కర్ణాటకలో పర్యటించానన్నారు. జనవరిలో 11 రాష్ట్రాలు తిరిగినన్నారు. లోక్ సభ ఎన్నికల విషయంలో ఎవరి మనసులో ఎలాంటి సందేహం కనిపించ లేదన్నారు. బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400లకు పైగా సీట్లు వస్తాయని చెప్పారని అన్నారు.
గత 10 ఏళ్లలో ప్రధాని మోడీ అనేక అభివృద్ది పనులు చేపట్టారని, ఊహకందని లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. ఈ పదేండ్లలో దేశాన్ని ప్రధాని మోడీ ఉన్నత శిఖరాలను తీసుకు వెళ్లారని చెప్పారు. మరో పదేండ్ల పాలన తర్వాత 2047లో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధాని కృషి ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి ప్రపంచంలోనే 5వ స్థానానికి ఎగబాకిందని వివరించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.