తెలంగాణ (Telangana) లో ఈసారి విజయఢంకా మోగించాలని బీజేపీ (BJP) అనేక వ్యూహాల్లో ఉంది. అభ్యర్థుల మొదటి జాబితాపై కూడా ఓ క్లారిటీకి వచ్చారు కమలనాథులు. ఓవైపు జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేవైఎం (BJYM) రెండు వర్గాలుగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయింది రాష్ట్ర బీజేవైఎం.
బీజేపీ కార్యాలయంలో గురువారం యువమోర్చా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. దీనికి హాజరయ్యేందుకు వచ్చారు తేజస్వీ సూర్య. అయితే.. ఈ సమావేశం సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా బీజేవైఎం రాష్ట్ర కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలోనే ఇదంతా జరిగింది. రాడిసన్ హోటల్లో తేజస్వీ సూర్యకు వసతి ఏర్పాట్లు చేస్తే.. ఆయన బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ సాయితో కలిసి ఎక్కడికో వెళ్లారంటూ రాష్ట్ర ప్రెసిడెంట్ బానుప్రకాష్ వర్గం మండిపడింది.
దీనిపై సమాధానం చెప్పాలంటూ సూర్యను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తేజస్వీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. భానుప్రకాష్ సమావేశానికి రానని స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇలానే వ్యవహరిస్తున్నారని బీజేపీవైఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. భానుప్రకాష్ తో సహా యువమోర్చా కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
భానుప్రకాష్, సాయి మధ్య మల్కాజిగిరి కోసం యుద్ధం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో తేజస్వీ రావడం.. ఆయన సాయి వైపు ఉండడంతో భాను ప్రకాష్ వర్గం రగిలిపోతోంది.