కొన్ని నెలల క్రితం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odish Train Accident) యావత్ దేశాన్ని కుదిపేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను రైల్వేశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో ఉన్నట్లు ట్రైన్‌లోనూ బ్లాక్ బాక్స్(Black Boxes)లను ఏర్పాటు చేయనుంది. రైళ్లలో క్రూ వాయిస్ వీడియో రికార్డింగ్ సిస్టమ్(సీవీవీఆర్ఎస్)ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి కారణమేంటి? ఏం జరిగింది? అనే కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు సీవీవీఆర్ఎస్ తోడ్పడుతుంది. ప్రమాదానికి ముందు జరిగే పొరపాట్లు, రైలు ప్రయాణించే మార్గానికి సంబంధించిన లోపాలపై ఎప్పటికప్పుడు లోకో పైలట్‌ను అలర్ట్ చేస్తుంది. తద్వారా ప్రమాదాలు తగ్గడం, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా ఉంటుంది.
త్వరలోనే రైల్ ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా విమానాల్లో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్‌ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది లోకో పైలట్ల మాటలు, రైలు కార్యకలాపాల వీడియో, ఆడియో రికార్డ్ చేస్తుంది. రైలు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. వేగం, బ్రేక్స్, ఇంజిన్ స్థితి సహా కీలక అంశాలను గమనిస్తుంది.
బ్లాక్ బాక్స్‌లను రైళ్లలో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు దాదాపుగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్‌తో పాటు.. రైళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ప్రతి రైల్ ఇంజిన్‌లో 4 డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎనిమిది ఇంజిన్లలో ఈ బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశామని త్వరలోనే మరిన్ని రైల్వే ఇంజిన్లకు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.