బెంగళూరు (Bangalore) రామేశ్వరం (Rameshwaram) కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.. కర్ణాటక (Karnataka), బళ్లారి జిల్లా నుంచి షబ్బీర్ అనే అనుమానితుడిని పట్టుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడి చిత్రాన్ని గతంలో ఎన్‌ఐఏ విడుదల చేసింది.
అతని ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలిస్తుండగా తాజాగా నిందితున్ని గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 1 న, అనుమానితుడి ఫోటోతో పాటు అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని అధికారులు అనుమానించారు. సీసీటీవీలో రికార్డయిన ఫుటేజీలో అతను కేఫ్ లోపల ఇడ్లీ ప్లేట్‌ను తీసుకువెళుతున్నట్లు కనిపించింది. అయితే అతను ధరించిన షోల్డర్ బ్యాగ్ లోపల ఐఈడీ బాంబు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు.
మరో సీసీటీవీ ఫుటేజీలో, అదే అనుమానితుడు బ్యాగ్‌తో రెస్టారెంట్ వైపు నడుచుకుంటూ రావడం గమనించారు.. మరో మూడు CCTV వీడియోలను విశ్లేషించిన తర్వాత, దర్యాప్తు అధికారులు మార్చి 9న కేఫ్ పేలుడు తర్వాత నిందితుడు తన బట్టలు, రూపాన్ని చాలాసార్లు మార్చుకున్నాడని తెలిపారు. ఒకదానిలో, అతను ఫుల్-స్లీవ్ షర్ట్, లేత-రంగు పోలో క్యాప్, కళ్లద్దాలు, ఫేస్ మాస్క్ ధరించి కనిపించాడు.
రెండవ వీడియోలో, అతను పర్పుల్ కలర్ హాఫ్-స్లీవ్ టీ-షర్టు, నలుపు రంగు టోపీలో కనిపించాడు. మరోవైపు నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ 10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.. అదేవిధంగా పేలుడుకు టైమర్‌తో కూడిన ఐఈడీ పరికరాన్ని ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం..