దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ (Brazil)లో కరవు కారణంగా చెలరేగిన దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల వల్ల వేలాది ఎకరాల్లో అమెజాన్ అటవీ (Amazon forest) ప్రాంతం అగ్నికి ఆహుతి అవుతోంది. తరచూ అగ్నిప్రమాదాలు(Fire accidents) చోటుచేసుకుంటుండటంతో అక్కడి వృక్ష, జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కార్చిచ్చుల తీవ్రత రొరైమా(Roraima)లో రాష్ట్రంలో అధికంగా ఉంది.
బ్రెజిల్ భూభాగంలో రొరైమా కేవలం 2.6 శాతమే ఉన్నప్పటికీ అక్కడ ఫిబ్రవరి నెలలో ఏకంగా 2,057 కార్చిచ్చులు ఏర్పడ్డాయి. బ్రెజిల్‌వ్యాప్తంగా నమోదైన కారిచ్చుల్లో కేవలం రొరైమాలోనే 30 శాతం నమోదయ్యాయి. రొరైమాలో అటవీ మంటలు జనావాసాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చే సమయం ఉండదనీ.. ఇంటిని, పొలాలను వదిలేసి ప్రాణాల కోసం పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేమని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు అమెజాన్ అడవులు అంతరించేపోయే ప్రమాదం ఉందని బ్రెజిల్‌లోని ఓ యూనివర్శిటీ అధ్యయనం ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. 2050 నాటికి టిప్పింగ్ పాయింట్‌కు అమెజాన్ అడవులు చేరుకోనున్నాయని తెలిపింది. రానున్న 25 ఏళ్లలో 10 నుంచి 47 శాతం అమెజాన్ అడువులు పచ్చికబయళ్లుగా మారనున్నట్లు వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పెరగడం, విపరీతమైన కరవులు, అటవీ నిర్మూలన, కార్చిచ్చులు కారణంగా అమెజాన్ ప్రాంతం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆ అధ్యయనం చెబుతోంది.
అదేవిధంగా కావాల్సినన్ని హెలికాప్టర్లు లేకపోవడం వల్ల మంటల్ని అదుపుచేయడం కష్టంగా మారిందని గవర్నర్ ఆంటోనియో తెలిపారు. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వానికి సాయం కోరినట్టు చెప్పారు. బ్రెజిల్‌వ్యాప్తంగా కార్చిచ్చులు సంభవిస్తున్నప్పటికీ రొరైమా రాష్ట్రంలో ఆ సంఖ్య ఎక్కువగా ఉండటం వెనుక మరో కారణం ఉంది. కొందరు వ్యక్తులు తమ భూములను విస్తరించేందుకు అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను కాల్చుతుండటం వల్ల మంటలు చెలరేగుతున్నాయని అధికారులు వెల్లడించారు.