Telugu News » Politics : మేడమా? అయితే ఏంటి? అధికారం వస్తే ఇలాగే ఉంటుందా..?

Politics : మేడమా? అయితే ఏంటి? అధికారం వస్తే ఇలాగే ఉంటుందా..?

నది దాటే వరకు ఓడ మల్లన్న నది దాటాక బోడ మల్లన్న అనే స్థితికి వచ్చింది. పదవులు రాకముందు అమ్మా, అయ్యా అంటూ మేడం వద్ద మోకరిల్లిన నేతలు పదవులు దక్కిన తరువాత కాలర్ ఎగురేస్తున్నారు.

by admin

– ఏక్ నాథ్ షిండేలవుతాం
– పార్టీ మారుతాం
– మేడంకే వార్నింగ్ ఇస్తున్న నేతలు
– అన్నీ గమనిస్తున్న మేడం టీమ్
– పాపాల చిట్టా ప్రిపేర్ అవుతోందా..?

అసెంబ్లీ ఎన్నికలు ఒక పార్టీని పడుకోబెడితే.. మరో పార్టీ ఆశలు చిగురింపచేసింది. అప్పటి వరకు జీవం లేకుండా ఉన్న ఆ పార్టీలో ఒక్కసారిగా ఉపు వచ్చింది. కాదు.. రాదు.. అయిపోయింది.. వేస్ట్ లాంటి ఎన్నో మాటలు భరిస్తూ.. దిక్కులేక ఇక్కడ ఉన్నామనే భావనలో.. అధికారం కోసం పోరాటం చేసి చేసి అలసిపోయామని అనుకొన్న చివరి దశలో.. మరణశయ్యపై ఉన్న మనిషికి సంజీవిని దొరికినట్లుగా విజయం అందింది. అంతే, స్వరం మారింది. గౌరవం తగ్గింది.

రాజకీయాల్లో గౌరవ మర్యాదలు అనేవి నీటి మీద రాతలే. నిన్న తిట్టిన నోటితోనే నేడు సూపర్, బంపర్ అంటూ పొగిడేస్తుంటారు. పార్టీల్లోనూ అంతే. పైస్థాయిలో ఉన్న వారితో అవసరం ఉన్నంత వరకే, తర్వాత నువ్వెంత నీ కథెంత అనే రేంజ్ లో మాటలు నడుస్తాయి. ప్రస్తుతం మేడం కనుసన్నల్లోని పార్టీలో అదే జరుగుతోంది. ఒకప్పుడు ఢిల్లీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు ఇక్కడి నేతలకు చెమటలు పట్టేవి. భయంతో గజగజ వణికిపోయేవారు. గీత గీసి దాటొద్దంటే ఏం జరిగినా సరే దాటే ఆలోచనే చేసే వారు కాదు. కానీ, కాలం మారింది. మేడం మాటంటేనే లెక్క చేయని పరిస్థితి నెలకొంది.

మనకు ఎదురు లేదు, తిరుగే లేదు అనేలా వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. నది దాటే వరకు ఓడ మల్లన్న నది దాటాక బోడ మల్లన్న అనే స్థితికి వచ్చింది. పదవులు రాకముందు అమ్మా, అయ్యా అంటూ మేడం వద్ద మోకరిల్లిన నేతలు పదవులు దక్కిన తరువాత కాలర్ ఎగురేస్తున్నారు. అంతేనా, ఏకంగా మేడం నుంచి ఫోన్ వస్తే.. అప్పుడున్న వణుకు, గౌరవం మాయం అయిపోయాయి. మేడమా? అయితే ఏంటి? ధోరణికి వచ్చేసినట్టు కనిపిస్తోంది.

మరీ ఓవర్ చేస్తే, పార్టీ మారుతాం.. ఏక్ నాథ్ షిండేలుగా తయారు అవుతామంటూ బ్లాక్ మెయిలింగ్ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే.. ఇదంతా మేడం టీమ్ నిశితంగా గమనిస్తోంది. పీఎంలనే మార్చినాం.. కేవలం రాష్ట్ర నేతలకు బుద్ధి చెప్పడం పెద్ద పని కాదన్నట్టు టైమ్ కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే నేతల పాపాల చిట్టాను మేడం టీం రెడీ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఏదైనా తెగే దాకా తీసుకెళ్లకూడదు. లేదంటే, అసరుకే ఎసరు తప్పదు.

You may also like

Leave a Comment