బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33)( Cantonment MLA Lasya Nandita) రోడ్డు ప్రమాదం(Road Accident) లో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్(ORR)పై ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఈ ప్రమాదంలో కారునడుపుతున్న ఎమ్మెల్యే పీఏ ఆకాష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆకాష్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగంతో పాటు నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రమాదంలో లాస్య నందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది.
కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. లాస్యనందిత ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన సమయంలోనూ ప్రమాదం జరిగింది. అప్పుడు ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్ పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. పదిరోజుల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత కన్నుమూశారు.
దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో మృతిచెందడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి, గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్యనందిత మృతి బాధకలిగించిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అదేవిధంగా లాస్య మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య అకాల మరణం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే లాస్య నందిత మరణించడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి మనో ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్యమరణం బాధించిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా లాస్య మృతిపై మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. లాస్యనందిత అకాల మరణం తనను ఎంతో బాధించిందన్నారు. లాస్య తండ్రి సాయన్నతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.