విద్యుత్ శాఖ(Electricity Department)లో కారుణ్య నియామకాల(Compassionate appointments)కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ మృతిచెందిన వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది.
గత ప్రభుత్వంలో 2020 మార్చి 4వ తేదీన ఏర్పాటు చేసిన 42వ బోర్డు సమావేశంలో విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలను రద్దు చేసింది. అంతేకాదు అదే ఏడాది ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీచేసింది. అయితే వాటిని కొత్త ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైంది.
గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోసారి దరఖాస్తు చేసుకోడానికి వారికి అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈ నియామకాలు కేవలం మృతిచెందిన ఉద్యోగుల పిల్లల/జీవిత భాగస్వామికి మాత్రమే పరిమితం చేయలేదు.
విధి నిర్వహణకు శారీరకంగా స్థోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో సీఎండీ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఏకీకృత (యూనిఫాం) పాలసీని రూపొందించాలంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నవారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా (ఫార్మాట్)ను రూపొందించాలని సూచించింది.