ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఎక్కడో కలుగులో ఉన్న నేతలు సైతం బయటకు వస్తారు.. స్క్రిప్ట్ చదివి పోతారు.. వారు చేపట్టిన పదవికి అయిన సరిగ్గా న్యాయం చేయలేరు.. మరి కొందరికైతే కనీసం వారు ఏ శాఖను నిర్వహిస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉన్నారని మేధావులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీలకు ఖర్చులు పెరుగుతున్నాయే కానీ బతుకులు మారడంలేదని సామాన్యుడు ఆవేదనపడుతున్నాడు..
ప్రస్తుతం నేటి సమాజంలో రాజకీయాల తీరుకు మూగ గొంతులు సైతం గొంతు పగిలేలా, కంఠనాళాలు తెగిపోయేలా వచ్చే ఆవేశాన్ని అణుచుకుంటున్నాయని కొందరు అంటున్నారు. కానీ ఇవేవీ పట్టని నేతలు రాజకీయాలు చేస్తూ పదవులే పరమావధిగా ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఓటర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇన్ని అనుమానాల మధ్య పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి.
ఇక విమర్శలు ప్రధాన అస్త్రాలుగా ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ (BRS).. గెలుపు ధీమాలో ఉంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్థి గురించి వివరిస్తూనే కాంగ్రెస్ (Congress) పార్టీపై విరుచుకుపడ్డారు.. ఎల్బీనగర్ ( LB Nagar) నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
అసలు అధికారంలోకి వస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ లో ఏడుగురు ముఖ్యమంత్రులు అవుతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2018లో కేసీఆర్ (KCR) ఓడిపోతారని సర్వేల పేరుతో ప్రచారం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఓడిపోతారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. కర్ణాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారన్న మంత్రి.. కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మతకల్లోలాలని కేటీఆర్ మండిపడ్డారు.