కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అసెంబ్లీ(Assembly) వేదికగా రెండు రోజుల పాటు శ్వేత పత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో చర్చసాగింది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో నెట్టివేశారని తెలంగాణ ప్రజలను ఆగం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. అయితే పలు కారణాలతో రేపటికి వాయిదా వేసుకున్నారు. బీఆర్ఎస్ శ్వేతపత్రంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సాధించిన పురోగతి, అంతకుముందున్న పరిస్థితులపై, తాము సృష్టించిన సంపద తదితర అంశాలపై వివరించాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అయింది.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. దీంతో ఈరోజు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తినెలకొన్న తరుణంలో చివరి నిమిషం శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసుకున్నారు.
అయితే ఇవాళ ఎందుకు వాయిదా వేశారు అనే విషయాన్ని బీఆర్ఎస్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఏది ఏమైనా సరే అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు, తొమ్మిదిన్నరేళ్లు రాత్రి పగలు తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోమని కేటీఆర్ అన్నారు. ఇక, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను రేపు ఇస్తామని చెప్పారు.