సౌతాఫ్రికా(South Africa) పర్యటన నుంచి టీమ్ ఇండియా(Team India) యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఉన్నట్టుండి నిష్క్రమించడం పట్ల బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇషాన్ మానసికంగా అలసిపోయినందునే సఫారీ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని పేర్కొంది.
‘తనకు విరామం కావాలని ఇషాన్ కిషన్ మమ్మల్ని కోరాడు. ఏడాదిగా నిర్విరామంగా వివిధ సిరీస్‌లు, టోర్నీల్లో ఆడుతున్న కారణంగా మానసికంగా అలసిపోయినట్లు తెలిపాడు. అందుకే సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో అతడి విన్నపం మేరకు విశ్రాంతినిచ్చాం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఇషాన్ కిషన్ ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఆపై ఐపీఎల్‌లో ఆడిన ఇషాన్.. తర్వాత జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో టీమ్ ఇండియా తరఫున ఆడాడు. గత నెల స్వదేశంలో అస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లోనూ పాల్గొన్నాడు ఇషాన్.
అయితే వరుస మ్యాచ్‌ల కారణంగా ఇషాన్ మానసికంగా అలసిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల జట్టు మేనేజ్‌మెంట్‌ను కలిసిన ఇషాన్ తన పరిస్థితిని వివరించారు. దీంతో కొంతకాలం తనకు క్రికెట్ నుంచి రెస్ట్ ఇవ్వాల్సిందిగా బీసీసీఐను కోరగా, మేనేజ్‌మెంట్ అంగీకరించింది. ఇక ఇషాన్ స్థానాన్ని కేఎస్ భరత్‌తో భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.