పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రత్యర్థి పార్టీలపై నేతలు విరుచుకుపడటం కనిపిస్తోంది.. నేరుగా మాటల దాడితో పాటు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఎప్పటికప్పుడు పార్టీల విధానాలపై కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ (BRS) ట్విట్టర్ వేదికగా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై ఫైర్ అయింది. అధికారంలోకి వచ్చిన 7 రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని బీజేపీ నుంచి కాపాడుకోలేక పోయిందని ఎద్దేవా చేసింది.
గత పదేళ్లలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించింది. ఒకరకంగా బీజేపీ బలపడటానికి కాంగ్రెస్ కారణం అయ్యిందని పేర్కొంది. కాంగ్రెస్ బలహీనమైన సిద్దాంతాల వల్ల ఆ పార్టీ పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొనే దశకు చేరుకొందని విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీని నిలువరించే సత్తా కేవలం బలమైన ప్రాంతీయ శక్తులకు మాత్రమే ఉందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.
మరోవైపు కాంగ్రెస్ చేతగాని తనం.. బీజేపీకి వరంగా మారిందని సెటైర్లు వేసింది. ఆ పార్టీ నుంచి తమ ప్రభుత్వాన్ని కాపాడలేకపోయిన కాంగ్రెస్.. బీఆర్ఎస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలపై బీజేపీకి బీ టీమ్ అని ముద్ర వేసిందని ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా రెండు వారాల గడువు ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కనీసం తమ ఉనికి కాపాడుకోవాలనే ప్రయత్నంలో జోరుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే..
కాంగ్రెస్ నేతలు సైతం.. అందుకు ధీటుగా సమాధానాలు ఇవ్వడం కనిపిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) రిజల్ట్ తర్వాత రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరగడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఒక వేల అనుకొన్న డిపాజిట్ కాంగ్రెస్ దక్కించుకొంటే ఒకరకంగా.. లేదా బీజేపీ అధికారంలోకి వస్తే మరో రకమైన రాజకీయాలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని అనుకొంటున్నారు..