తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం మూటగట్టుకొన్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పుంజుకోవాలనే ప్రయత్నాలని మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు సార్లు తిరుగులేని మెజారిటీ సాధించిన గులాబీ.. ప్రతిపక్షం పోరు లేకుండా.. మూడోసారి సైతం అధికార పీఠం తమదే అనే ధీమాలో ఉంది. అయితే అనుకొని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పుంజుకోవడం.. అధికారం కైవసం చేసుకోవడం జరిగిపోయింది.
ఊహించకుండా ఓటమి అందుకొన్న బీఆర్ఎస్ (BRS) నేతలు, శ్రేణులు ఇంకా ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఓటమిపై గులాబీ అధిష్టానం, ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతోంది. ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ (KCR).. పార్టీ నేతలు అందుబాటులో ఉండాలనే సందేశాలు పంపినట్టు వార్తలు వచ్చాయి.
మరోవైపు ఎంపీ ఎన్నికల్లో పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మంత్రులు, పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ కీలక నేతలకు ఎంపీ ఎన్నికల విషయంలో దిశా నిర్దేశం చేసే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం పడిందని అంటున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్ నేతలతో ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశం నిర్వహించారు..
ఈ సమావేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఎమ్మెల్యేలకు, ఎంపీ ఎన్నికల విషయంలో కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. లోక్ సభఎన్నికల్లో గెలిచి పార్టీ పరువు నిలబెట్టుకోవాలనే యోచనలో ఉన్న బీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రభత్వ పనితీరుపై సైతం అలర్ట్ గా ఉండాలని సూచించినట్టు సమాచారం..