అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఊహించని విధంగా పరాజయం రుచి చూసిన బీఆర్ఎస్ (BRS).. తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోనట్టు తెలుస్తోంది. ఇందుకోసం వచ్చే ఏడాదిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల అనుభవాలని దృష్టిలో పెట్టుకొని.. లోక్ సభ ఎన్నికల్లో అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోందని తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికల రచనలో ఆ పార్టీ ముఖ్య నేతలు కీలక చర్చలు జరుపుతోన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత కాస్త విరామం తీసుకొన్న కేసీఆర్ పార్టీ కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీలంతా.. వెంటనే ఢిల్లీ (Delhi) నుంచి హైదరాబాద్ (Hyderabad) రావాలని కేసీఆర్ ఆదేశించినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం.. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని.. లోక్సభ సభ్యులతో విడివిడిగా సమావేశమై, చర్చలు జరపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అవమానంగా భావిస్తున్న గులాబీ దళం.. కనీసం లోకసభ ఎన్నికల్లో అయినా పరువు కాపాడు కోవాలని చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తోన్నాయి.
మరోవైపు లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపై కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించడానికి సిద్దపడుతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పది సంవత్సరాల తర్వాత తెలంగాణ అధికార పీఠం చేయి జారిపోవడంతో..రాజకిరీటం పడిపోయినట్టు గులాబీ నేతలు భావిస్తున్నారని కాంగ్రెస్ (Congress) నేతలు అనుకొంటున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి షాకివ్వడానికి హస్తం సిద్దం అవుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది.