ఎన్నికల సమరం కంటే ముందు నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. కేసీఆర్ (KCR) పాలనలో.. బీఆర్ఎస్ (BRS) నేతల విచ్చలవిడి దోపిడీకి.. భూ కబ్జాలకి.. ఆరాచకాలకి రాష్ట్రం బలైందని రేవంత్ రెడ్డి సైతం పలు సమావేశాల్లో.. సభల్లో ఆరోపణలు గుప్పించారు..
అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం అవుతారని ఊహించని బీఆర్ఎస్ నేతలు.. ప్రస్తుతం తమ అవినీతి ఎక్కడ బయటకి వస్తుందో అనే భయంతో.. నోటికి వచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నట్టు హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో అవినీతి అంశాలే కీలకంగా మారినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై కాంగ్రెస్ నేతలు విరుచుకు పడుతున్నట్టు సమాచారం..
కాగా రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై.. బీఆర్ఎస్ నేతలకి ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2013లోనే అనుమతులు సాధించిందని, పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి సీఎం ఉన్నప్పటికీ పాలమూరు జిల్లా వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మండిపడ్డారు..
నాడు డ్రగ్స్ ఘటనపై సిట్ వేయాలని తానే పోరాటం చేశానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.. డ్రగ్స్ కోరల్లో చిక్కుకున్న పంజాబ్ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారని విమర్శించారు. కష్టాలు తెలిసిన వ్యక్తి అని రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తాడని కేసీఆర్ ని, సీఎం చేస్తే.. ఆయనతో పాటు..ఆయన చుట్టూ చేరిన కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని ఎన్ని దారుల్లో దోచుకోవాలో అన్ని దారుల్లో దోపిడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.. బీఆర్ఎస్ పాలనలో తప్పు చేసిన వారు.. దర్జాగా బ్రతికారు.. తప్పును ప్రశ్నించిన వారు జైలు పాలైయ్యారని రేవంత్ మండిపడ్డారు.. అబద్ధాలు చెబుతూ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు..