బీఆర్ఎస్ (BRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో గుర్తుల వివాదానికి సంబంధించి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఉపసంహరించుకొంది. బీఆర్ఎస్ తరఫు లాయర్ మూడు రోజుల క్రితం అంటే అక్టోబరు 17న తిరిగి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టనున్నది.
ఇప్పటికే ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి రోడ్డు రోలర్, ట్రాక్టర్, ఆటోరిక్షా, సోప్ బాక్స్, డోలీ తదితర గుర్తుల్ని తొలగించాలని చేసిన రిక్వెస్టును తిరస్కరించింది. తెలంగాణ హైకోర్టు సైతం గుర్తుల తొలగింపుపై గతంలోనే వివరాలతో కూడిన సమాధానం ఇచ్చామని, స్పష్టమైన తీర్పు వెలువరించామని పేర్కొన్నది. ఈ నెల 12న బీఆర్ఎస్కు రాసిన లేఖలో మూడు విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ జయదే లాహిరి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో ఈనెల 17న దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు రానున్నది. మరోవైపు తమ పార్టీకి కామన్ సింబల్‌గా కారు గుర్తు ఉన్నదని, రోడ్డు రోలర్ సైతం కారును పోలి ఉన్నందున ఓటర్లు కన్ఫ్యూజన్కు గురవుతున్నారని బీఆర్ఎస్ తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పెట్టుకున్న మూడు విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకోలేమని ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ పేర్కొన్నారు. వాటిని తిరస్కరిస్తున్నట్లు తాజా లేఖ (నెం. 56/06/2023/పీపీఎస్-1/2805)లో బీఆర్ఎస్ అధ్యక్షుడికి వివరించారు.