తెలంగాణా (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల ( Assembly Election)పోరు హమాస్-ఇజ్రాయిల్ (Hamas-Israel) యుద్ధాన్ని తలపించేలా సాగుతుంది. గత రెండు సార్లు ఎక్కువ పోటీ లేకుండానే.. తెలంగాణ సెంటిమెంట్.. బయటి పార్టీలు వస్తే రాష్ట్రం ఆగం అవుతుందన్న భయంతో ఓటర్లు టీఆర్ఎస్ (TRS)అలియాస్ బీఆర్ఎస్ (BRS)కు ఓట్లు వేశారు అనే టాక్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరుగుతున్న ఈ మూడో అసెంబ్లీ ఎన్నికలలో కూడా తిరుగు లేదని అనుకుంటున్న బీఆర్ఎస్‌కి ఈ పోరు చెమటలు పట్టిస్తుందని ప్రజల మనోభావం..
ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్‌కు సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. అసమ్మతితో పార్టీని వీడుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు నియోజక వర్గాలలో అసంతృప్తి నేతలు పక్క పార్టీల్లో జంప్ అయ్యారు.. ఇంకా వలసలు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ (KCR)పార్టీ నేతలపై సీరియస్ అయినట్టు సమాచారం. అసమ్మతి నేతలను శాంతింపజేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేతలు విఫలం అవుతుండటం, పార్టీ మారుతుండటంపై పలువురు ఎమ్మెల్యే క్యాండిడేట్ లకు క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాల వార్ రూం నుంచి నిత్యం, అభ్యర్థితో పాటు ఇన్‌చార్జులు, నేతలను అలర్ట్ చేస్తున్నా ఎందుకు వలసలు పెరుగుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే అసమ్మతి నేతలు, కార్యకర్తల ఇంటికి వెళ్లి పార్టీ మారకుండా చూడాలని అధిష్టానం నేతలకు మార్గనిర్దేశం చేసింది. ప్రతీ ఓటు కీలకమని.. ఆదిశగా ప్రతీ ఒక్కరిని కలువాలని సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించాలని ఆదేశించింది.
మరోవైపు అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్‌చార్జుల వైఫల్యంతో పార్టీ నేతలు పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారని వార్ రూంలు కేసీఆర్‌కు నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో నల్లగొండ, మల్కాజిగిరి, ఎల్బీనగర్, నాగార్జున సాగర్, మునుగోడు, జహీరాబాద్ ఇలా పాతిక నియోజకవర్గాలకు పైగా నేతలకు సీఎం క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.