అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై ఇటీవల కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఓటమికి బాధ్యులుగా ఎమ్మెల్యేలను చిత్రీకరించే విధంగా మాటలున్నాయని ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు.. ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇదే రాగం అందుకొన్నట్టు తెలుస్తోంది. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ లోక్ సభ సన్నాహక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు..
ఈ మీటింగ్కు నిజామాబాద్ (Nizamabad) జిల్లా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే.. బీఆర్ఎస్ నేతలే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం కోటరీ ఏర్పాటు చేసుకొన్నారని సీరియస్ అయ్యారు.. ప్రజలను సమన్వయ పరచుకుని ముందుకు వెళ్లడంలో ఇక్కడి నేతలు విఫలం అయ్యారని పేర్కొన్నారు..
ప్రభుత్వ పథకాలను వారి కార్యకర్తలకే ఇవ్వడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కింది స్థాయి క్యాడర్ నేతలను కలవాలని భావిస్తే వారిని దూరం పెట్టారని.. ఈ చర్యల వల్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని తెలిపారు.. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్కు అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో మనం ఓడిపోయాం అంటే.. నేతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు..
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజాబామాద్ ఎంపీ సీటును గెలిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. మరోవైపు బిల్కిస్ బానో(Bilkis Bano) కేసులో ఉన్న దోషుల ముందస్తు విడుదలను, సుప్రీంకోర్టు(Supreem Court) రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన కవిత.. ఇలాంటి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణనని అభిప్రాయపడ్డారు.