వచ్చే ఎన్నికల్లో తాను మూడోసారి గెలవడం ఖాయమన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తోందన్న ఆయన.. ఇద్దరు ఎమ్మెల్సీలను మంత్రి కేటీఆర్ కట్టడి చేశారన్నారు. నియోజకవర్గంలో నేతలెవరూ గందరగోళానికి గురికావొద్దని చెప్పారు. పార్టీ ఎవరిని తప్పు పట్టదని.. డిస్టబెన్స్ చేసిన వారిని మాత్రమే తప్పుపడుతుందని తెలిపారు.
స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ బెంగ పెట్టుకోవద్దన్న ముత్తిరెడ్డి.. పార్టీ అందరినీ ఆదరిస్తుందని చెప్పారు. అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన నాయకులు మరోసారి ఇబ్బంది పెట్టొద్దని కోరారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ క్యాడర్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రపంచంలో తెలంగాణను గ్రీన్ సిటీగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు దక్కుతుందన్నారు ముత్తిరెడ్డి.
ప్రజల కోరికలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయని.. జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. జిల్లా కోర్టుకు 10 ఎకరాలు కేటాయించామని.. పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 15న వర్చువల్ గా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజున పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ప్రతి గ్రామానికి నీరు అందించామని.. తాగు, సాగు నీరు, హరితహారం, పట్టణీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసం అన్నీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వివరించారు.
జనగామ టికెట్ కోసం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి మాటల యుద్ధం కొనసాగుతోంది. పైగా, అభ్యర్థిని ప్రకటించకుండా జనగామ టికెట్ ను పెండింగ్ లో పెట్టారు కేసీఆర్. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని కొన్ని రోజులుగా నియోజకవర్గ నేతలు గందరగోళంలో ఉన్నారు.