Telugu News » కేసీఆర్ కు రేవంత్ లేఖాస్త్రం!

కేసీఆర్ కు రేవంత్ లేఖాస్త్రం!

కేసీఆర్ మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్న రేవంత్.. పైసలిచ్చి కొనుగోలు చేద్దామన్నా ఎరువులు దొరకడం లేదని చెప్పారు.

by admin
revanth reddy sudden tour to bengaluru

తెలంగాణలో ఎన్నికల యుద్ధం కొనసాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్టు ఢీకొడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇంకోవైపు బహిరంగ లేఖలతో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. తాజాగా రైతుల సమస్యలపై నిలదీశారు. కేసీఆర్ ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలలాగే మాట ఇచ్చి వదిలేశారని విమర్శలు చేశారు.

revanth reddy sudden tour to bengaluru

కేసీఆర్ మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్న రేవంత్.. పైసలిచ్చి కొనుగోలు చేద్దామన్నా ఎరువులు దొరకడం లేదని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్న వార్తలు వైరల్ కావడంతో.. ఎరువుల కోసం వారు పడుతున్న బాధలను లేఖలో వివరించారు రేవంత్. ఎరువుల కోసం రైతులు క్యూ లో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. సీఎం సొంత జిల్లాలో కూడా ఇదే దుస్థితి నెలకొందని విమర్శించారు. యూరియా నిల్వలు పెట్టాలనే సోయి ప్రభుత్వానికి లేదని.. వెంటనే ఎరువులను మార్కెట్‌ లో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

‘‘ప్రస్తుత డిమాండ్‌‌ కు అనుగుణంగా కనీసం 2 లక్షల టన్నుల అవసరం ఉండగా.. ఇప్పుడు లక్షా 10 టన్నులే బఫర్‌‌ స్టాక్‌ మాత్రమే‌ ఉంది. ఫలితంగా రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడింది. వర్షాలు పడుతున్నా పలు ప్రాంతాల్లో పంటలకు వేయడానికి యూరియా లేదు. వినియోగం గణనీయంగా పెరుగడంతో ఇప్పుడున్న నిల్వలు సరిపోతలేవు. ప్రతి సీజన్లో యూరియా, ఎరువుల కొరత రైతులను వేధిస్తూనే ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ సమస్య జఠిలమవుతున్నా.. రైతు బంధు పేరు చెప్పి ప్రభుత్వం ఈ విషయాన్ని తెలివిగా పక్కదారి పట్టిస్తోంది’’ అని విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.

మరోవైపు, హైదరాబాద్‌ లో డెంగ్యూ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్. నెల వయసున్న చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా డెంగ్యూ బారిన పడుతున్నారని.. ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారని ట్విట్టర్ లో తెలిపారు. ఇటీవల డెంగ్యూతో ఖమ్మం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజలు భయాందోళన చెందుతున్నారని.. పేద, మధ్యతరగతికి వైద్య ఖర్చు మోయలేని భారంగా మారిందని అన్నారు. మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

You may also like

Leave a Comment