రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) అధిష్టానం తీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలే సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి.. ఈ సమయంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించక.. తలొదిక్కుగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. దీనికి తోడు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకొంటున్నాయి.
తెలంగాణ (Telangana)లో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీజేపీ (BJP) పోటాపోటీగా తలపడుతుండగా.. బీఆర్ఎస్ లో మాత్రం ఆ జోష్ కనిపించకపోవడంతో, కారునే నమ్ముకొని ఉన్న నేతల్లో కలకలం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పక్క పార్టీలోకి వలసలు సైతం ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు వరుసగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటం కారును కంగారు పెట్టిస్తోందని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి తర్వాత పార్టీకి అండగా నిలుస్తారనుకున్న నేతలే ఇలా చేజారిపోవడం బలమైన కారణం ఉందనే కొత్త వాదన తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ లో నెలకొన్న ఆధిపత్య పోరు.. వలసలకు కారణం అవుతోందనే చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అసంతృప్త నేతలను ఆపేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, నాగర్న కర్నూల్ ఎంపీ రాములు, తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గులాబీకి గుడ్ బై చెప్పి తమదారి తాము చూసుకొన్నారు. అయితే వీరు పార్టీ మారడం వెనుక బీఆర్ఎస్ లో నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వారే కారణం అనే టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలు పొమ్మన లేక పొగ పెట్టడం వల్ల ఈ ఆధిపత్యపోరు భరించడం కంటే పార్టీ మారిపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే మిగతా నాయకుల విషయంలోనూ ఆధిపత్యపోరే కనిపిస్తోందని అనుకొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు కార్పొరేటర్లు, కేటీఆర్ ముఖ్య అనుచరులు పార్టీ వీడేందుకు అక్కడి నేతలతో ఉన్న వర్గపోరే కారణం అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.. అదీగాక ఎంపీ టికెట్ల విషయంలోనూ ఏమాత్రం తగ్గని నేతలు.. ఎదుటి వారు తామ పార్టీ వారైనా సరే రాజకీయంగా శత్రువుగా భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా నల్గొండ (Nalgonda)లో గుత్తా సుఖేందర్ వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందనే చర్చ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని ఒక నేతకు మరో నేత అడ్డుపుల్లలు వేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలు కారు దిగివెళ్తుంటే.. నెక్స్ట్ లీడ్ లో ఉన్న లీడర్ ఎవరనేది బీఆర్ఎస్ లో సస్పెన్స్ గా మారిందని సామాచారాం.
తాజా పరిణామాలు క్యాడర్ ను తీవ్ర గందరగోళానికి గురి చేస్తుంటే అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం విమర్శలకు చోటిస్తోంది. పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరుకు చెక్ పెట్టి అసంతృప్త నేతలను బుజ్జగించాల్సిన అధినేత ఫామ్ హౌస్ కే పరిమితం అవడంతో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అధినేత తీరు మాత్రం మారడం లేదని కేసీఆర్ వైఖరిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు..