అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో వాదోపవాదాల నడుమ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్దాంతంపై విమర్శలు గుప్పించారు. ఆయన ప్రసంగం మధ్యలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగిలారు. ఓ సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కడియం గతంలో రాజయ్య నుంచి డిప్యూటీ సీఎం పదవిని లాక్కున్నాడని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా విమర్శలు చేశారు. దీంతో సభలో వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ సభలో కేసీఆర్ తన గురించి అవమానకరంగా మాట్లాడారని అన్నారు. దీంతో సభలో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాయింట్ పీకేసినా బుద్ది మారలేదని వ్యాఖ్యానించారు. దాంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.