తెలంగాణ (Telangana)లో బీఎస్పీ (BSP) పార్టీని గెలిపిస్తే ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడాని బహుజన సమాజ్ పార్టీ చీప్ మాయావతి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో పాల్గొన్న మాయావతి తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల పై పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను ఆపిందని ఆరోపించిన మాయావతి.. బీఆర్ఎస్ (BRS) దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.
అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని మాయావతి (Mayavati) తెలిపారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ని ఈ ఎన్నికలలో ఓడించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఐపీఎస్‌ను వదిలి.. ప్రజలకు సేవ చేయడం కోసం వస్తే.. అవినీతి ప్రభుత్వం అడ్డుపడుతుందని మాయావతి మండిపడ్డారు..
కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా.. వాటిని అమలు చేయట్లేదని విమర్శించిన మాయావతి.. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చే పార్టీలు అవసరమా అని ప్రశ్నించారు. బీఎస్పీని గెలిపించి అంబేద్కర్, కాన్షీరామ్ కలలను మనం సాకారం చేయాలని మాయావతి పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని వెల్లడించిన మాయావతి.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తు కు ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..
మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామని మాయావతి గుర్తు చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తరువాత భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.. ప్రజల కోసం శ్రమించే నాయకులు కావాలి కానీ కుటుంబం బాగుంటే చాలనుకునే పార్టీలను ఇంటికి పంపుదామని మాయావతి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొండని ప్రజలకు మాయావతి సూచించారు.