బీఎస్పీ అధికారంలోకి వస్తే నేడు జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని(Teachers Day) మారుస్తామని తెలిపారు. జనవరి మూడును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తామనీ బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ) రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెట్టిన సోషల్ మీడియా (Social Meadia)లో పోస్టులో ప్రవీణ్ కుమార్ తన భావాలను పంచుకున్నారు.
జనవరి మూడే ఎందుకంటే..?
‘‘కులమాతాలకు అతీతంగా పేదవాడి చదువుకు మరీ ముఖ్యంగా మహిళల చదువు కోసం నిరంతరం కృషి చేసిన, తొలితరం ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే. పేదవర్గాలూ, వితంతువులకు చదువు నేర్పించే ప్రయత్నంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న వ్యక్తి సావిత్రీబాయి పూలే. అలాంటి తొలితరం మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రీబాయి 1831 జనవరి 3 న జన్మించారు. సావిత్రీబాయి పూలే జయంతినే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తాం’’అని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆధునిక విద్య వల్లనే మహిళలు ఎదుగుతారని, కుటుంబం మొత్తం విద్యావంతులవడం సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి సావిత్రబాయి పూలే అని ప్రవీణ్ తెలిపారు. ఈమే 1848లో తన భర్త జ్యోతీరావ్ పూలేతో కలిసి మొదటి బాలికల పాఠశాలను పూణేలో ప్రారంభించారన్నారు. మహిళల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. ఉపాధ్యాయురాలిగా, రచయితగా, సంఘసంస్కర్తగా, ఉద్యమకారిణిగా…. ఇలా అనేక రంగాల్లో సావిత్రిబాయి పూలే తనదైన ముద్రవేశారని అన్నారు.