సీఎం జగన్(CM Jagan) సొంత చెల్లెలు షర్మిల(Sharmila)పై అసభ్యకరంగా మాట్లాడారని టీడీపీ నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి(BTech Ravi) ఆరోపించారు. కడప(Kadapa)లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జగన్ సొంత చెల్లెలు షర్మిల వస్త్రధారణపై జగన్ చాలా అసభ్యకరంగా మాట్లాడారని.. దీన్నిబట్టి ఆయన ఏస్థాయికి ఆయన దిగజారిపోయారో ఆలోచించాలని ప్రజలను కోరారు.
నుదిటికి ప్లాస్టర్‌తో వచ్చి పులివెందులలోనూ సానుభూతి సంపాదించాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు. ఇక్కడి ప్రజలు అంత అమాయకులని భావిస్తున్నారా? అని నిలదీశారు. సీఎం సతీమణి భారతి పసుపు వస్త్రాలు ధరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఇంట్లో ఉన్న ఆ రంగు చీరలను బయట పడేస్తారా? అంటూ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చిన్నాన్న రెండో పెళ్లి గురించి పులివెందులలోనే మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే జగన్‌కు ఈ విషయం తెలుసని స్పష్టం చేశారు. అయినా అప్పుడు వివేకా వ్యక్తిత్వం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నా తామెన్నడూ వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్‌కు సీఎం జగన్ ఏవిధంగా సర్టిఫికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లోనే చిన్నపిల్లాడు, అమాయకుడని అవినాష్‌ను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. జగన్ నామినేషన్‌కు డబ్బు, మద్యం ఇచ్చి జనసమీకరణ చేశారని అన్నారు.
ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఊదరగొడుతున్నారని, రాష్ట్రంలో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో సుమారు రూ.750కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారని, ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు రూ.80లక్షలు మాత్రమేనని బీటెక్ రవి తెలిపారు. దీన్ని బట్టి పేదవాడు ఎవరో? పెత్తందారు ఎవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. సీఎం అహంకారానికి, సొంత నియోజకవర్గం పట్ల చూపిన నిర్లక్ష్య వైఖరికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు.