నగరంలో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు.. కారణం ఏదైనా ఇలా ప్రమాదాలు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ నెల 13 వ తేదీన నాంపల్లి (Nampally) బజార్‌ఘాట్ లో ఉన్న బాలాజీ రెసిడెన్సీ (Balaji Residency)లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భవనం యజమాని రమేష్ జైశ్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు రమేష్ జైశ్వాల్‌ను కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు భవనం యజమాని రమేష్ జైశ్వాల్ గత కొంత కాలంగా అక్రమంగా కెమికల్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ విషయంలో భవనం యజమాని రమేష్ జైశ్వాల్ (Ramesh Jaishwal) పలుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
బుద్ధి మార్చుకోని రమేష్ జైశ్వాల్ నవంబర్ 13వ తేదీన కారు రిపేర్ చేస్తుండగా ఈ కెమికల్స్ డ్రమ్ములకు నిప్పు అంటుకుంది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తాజాగా రమేష్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్లు 285, 286 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు గత కొంతకాలంగా సిటీలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
మరోవైపు సికింద్రాబాద్‌లో ఏడాది కాలంలో నాలుగు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. గత జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత సిటీలో దాదాపు పదికి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు నగర ప్రజల్లో భయాందోళలు కలిగిస్తున్నాయి.