రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అధికారులు ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదల చేశారు. విడివిడిగా రెండు సీట్లకూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది.
మరోవైపు ఈ నెల 19న నామినేషన్లు పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, 29న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి, అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే కాంగ్రెస్ (Congress)లో పదవులు ఆశించి భంగపడ్డవారు ప్రస్తుతం పోటీపడనున్నట్టు తెలుస్తోంది. ఇక వేర్వేరు ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ఖాతాలో రెండు ఎమ్మెల్సీలు చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiam Srihari).. పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy).. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు టికెట్ త్యాగం చేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, హర్కల వేణుగోపాల్ రావు, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అలీ మస్కతి, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్ పేర్లు ఉన్నాయి. ఓడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లకు అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు..