Telugu News » ఫోన్ లో లేడీ..! జస్ట్ విని.. లక్షలు కొట్టేసిన కిలాడీ!!

ఫోన్ లో లేడీ..! జస్ట్ విని.. లక్షలు కొట్టేసిన కిలాడీ!!

కన్నింగ్ క్యాబ్ డ్రైవర్

by sai krishna

తన క్యాబ్ ఎక్కిన మహిళా ప్యాసింజర్ మాటల్లోని మేటర్ని బట్టి రూ.లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. చిన్న నాటి స్నేహితుడినని నమ్మబలికి రూ.22 లక్షలతోబాటు ముప్పావుకిలో బంగారాన్ని మింగేశాడు క్యాబ్ డ్రైవర్. ఈ సంఘటనతో సదరు మహిళ కాపురంలో కూడా కలతలు రేగాయి.

అవసరం కొద్దీ.. యాప్ లో క్యాబ్ కోసం వెతుకుతాం. అదృష్టం కొద్దీ లాటరీ తగిలినట్టు తగులుతుంది.మన రిక్వెస్ట్ కి ఎవరో ఒక క్యాబ్ డ్రైవర్ కనెక్ట్ అవుతాడు. వాడు ఎలాంటి వాడో మనకు తెలియదు..!సరే క్యాబ్ రాగానే రాజుగారికి రథం వచ్చినట్టు ఫీలై..ఎక్కి కూర్చాంటాం.

కార్లో ఉన్న ఆ పదినిమిషాలు కూడా కుదురుగా కూర్చోకుండా ఫ్రెండ్ కో, బంధువుకో,ప్రియుడికో, అటుడికో, ఇటుడికో,ఎవడో ఒకడికి ఫోన్ చేసి కెలుకుతాం. క్యాబ్ డ్రైవర్ కి చెవులుంటాయి..వాడు కూడా మనిషే అన్న స్ఫృహలేకుండా వాణ్ని కూడా కారులో ఒక భాగమనుకుని మాట్లాడ కూడని రహస్యాలు కూడా మాట్లాడేస్తుంటాం.

పక్కోడి పురాణం విని మర్చిపోయే రోజులు కాదివి..! మన పురాణంతో వాడు ప్రయోగాలు చేస్తాడు. పనికొస్తే ఫైల్ చేస్తాడు. కట్ చేస్తే మనం ఇరుక్కుంటాం. ముఖ్యంగా మహిళలు..తస్మాత్ జాగ్రత్త..ఏమో డ్రైవర్ లో ఏడేంజర్ దాగుందో ఎవరికి తెలుసు..!? లేదంటే బెంగుళూరులో ఓ మహిళకు వచ్చిన ప్రమాదమే మనకూ రావొచ్చు..!

వివరాల్లోకి వెళితే బాధితురాలు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 2022 డిసెంబర్లో ఇందిరానగర్ నుంచి బాణసవాడి వరకు క్యాబ్ను బుక్ చేసుకుంది. అనంతరం కారెక్కి తన చిన్ననాటి స్నేహితుడితో ఫోన్లో మాట్లాడింది. ఆమె మాటలు మొత్తం విన్న క్యాబ్ డ్రైవర్ కిరణ్.. కొద్ది రోజుల తరువాత బాధితురాలికి మెసేజ్ చేశాడు.

తాను బాధితురాలి చిన్నప్పటి క్లాస్మేట్ని అంటూ పరిచయం పెంచుకున్నాడు. అనంతరం మరికొన్ని రోజులకు ఫోన్ చేసి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. రూ.22 లక్షల సాయం కావాలని కోరాడు. దీంతో నిందితుడు కిరణ్ మాటలు నమ్మిన బాధితురాలు.. వెంటనే ఆ సొమ్మును అతడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది.


కొద్ది రోజుల తరువాత కిరణ్ మోసాన్ని తెలుసుకున్న బాధితురాలు విషయం ఎవ్వరికి చెప్పకుండా..క్యాబ్ డ్రైవర్ను దూరం పెట్టింది. ఏప్రిల్లో బాధితురాలికి మళ్లీ ఫోన్ చేసిన కిరణ్..బంగారాన్ని ఇవ్వమని డిమాండ్ చేశాడు.

లేకపోతే ఆ రోజు క్యాబ్లో తన స్నేహితుడితో మాట్లాడిన విషయాన్ని ఆమె భర్తకు చెబుతానని బెదిరించం మొదలుపెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు.. 750 గ్రాముల బంగారాన్ని నిందితుడికి ఇచ్చింది. కొంత కాలంగా ఇంట్లో అభరణాలు కనిపించకపోవడం వల్ల బాధితురాలిని నిలదీశాడు ఆమె భర్త.

దీంతో జరిగిన విషయాన్ని మొత్తం భర్తకు వివరించింది. దీంతో ఇంట్లో కలతలు కూడా రేగాయి. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి..రామమూర్తినగర్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హర్సఘట్టలో నివాసం ఉండే కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు.

You may also like

Leave a Comment