హైదరాబాద్ (Hyderabad) ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదం కేసుపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేస్తూ నేడు దుబాయ్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు. అందులో నా కుమారుడు రహీల్‌ను ఎవరూ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఛానల్లో ఈ కేసుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో నా కొడుకును ఇరికించారని మండిపడ్డారు.

తన కుమారుడు తప్పు చేశాడని తేలితే దేనికైనా సిద్ధమే అని తెలిపిన షకీల్.. బహిరంగంగా ఉరి తీసినా ఓకే అని పేర్కొన్నారు.. కానీ చేయని తప్పును రుద్దాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదన్నారు.. కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రహీల్ కి ఏం జరిగినా పోలీసు ఉన్నతాధికారులదే బాధ్యతని పేర్కొన్నారు..
అలాగే తాను ఈ కేసుపై న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు నాంపల్లి కోర్టులో రహీల్ (Raheel)కు ఊరట లభించిన విషయం తెలిసిందే. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలని పేర్కొంది..