– ఎన్నికల వేళ కాళేశ్వరంపై బీఆర్ఎస్ సైలెంట్
– ప్లస్ అవుతుందని అనుకుంటే ఫుల్ డ్యామేజ్
– ప్రభుత్వాన్ని వదలని కాంగ్రెస్, బీజేపీ
– ప్రచారంలో పదేపదే కాళేశ్వరం ప్రస్తావన
– ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లిన కాంగ్రెస్
– అవినీతిపరులు జైలుకేనంటున్న బీజేపీ
కాళేశ్వరం (Kalewaram).. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించింది. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు కాలువలు, రిజర్వాయర్లను కట్టింది. తాగు, సాగు నీరు కల్పించింది. రైతులకు నీటి కొరత సమస్య తీర్చింది. వరి దిగుబడి మాత్రమే కాదు.. మత్స్య సంపద కూడా బాగా పెరిగింది. ఇంకేముంది.. ఈసారి ఎన్నికల్లో మనకు తిరుగే లేదని అనుకున్నారు గులాబీ నేతలు. కానీ, మేడిగడ్డ (Medigadda) పిల్లర్ల కుంగుబాటుతో కథ అడ్డం తిరిగింది. కాళేశ్వరం మాటెత్తితే డ్యామేజ్ ఖాయమని.. ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండానే ప్రచారం కానిచ్చేస్తున్నారు బీఆర్ఎస్ (BRS) నేతలు. ఇదే సమయంలో కాళేశ్వరం లోపాలపైనా.. దాని వెనకున్న కేసులపైనా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
కాళేశ్వరం లోపాల నేపథ్యంలో అక్రమాలు జరిగాయని.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్, స్మితా సబర్వాల్ తో పాటు ఈఎన్సీలు, కాంట్రాక్ట్ కంపెనీలను నిందితులుగా చేర్చుతూ గతంలో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై భూపాలపల్లి కోర్టు విచారణ జరుపుతోంది. అయితే.. దీన్ని ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయాలా? లేదా? రాతపూర్వక వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలా అనే అంశంలో న్యాయస్థానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో సమయం పడుతోంది.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై సీబీఐతో విచారణ జరిపించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ నరేందర్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్యటించి, భద్రతా లోపాలను గుర్తించిందని అందులో పొందుపరిచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఇక్కడ పిటిషన్ దాఖలు చేసేందుకు చూస్తోంది కాంగ్రెస్.
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో ఉన్న నీళ్లు అన్నీ సముద్రం పాలయ్యాయి. సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఏంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 1.5 టీఎంసీలుగా ఉంది. అన్నారం సామర్థ్యం 10.97 టీఎంసీలు కాగా ఇప్పుడు 1.5 టీఎంసీలకు తీసుకొచ్చారు. బ్యారేజీలో జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని అదేశించింది. దీంతో బ్యారేజీలోని రంధ్రాలు, పగుళ్లు ఏమైనా ఉన్నాయో గుర్తించాల్సిన అవసరం మన ఇంజనీర్స్ పై ఉంది. ఇక మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోగా 16.17 టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు 0.06 మాత్రమే ఉంచారు. దీంతో.. ఈ ఏడాది ఒక్క చుక్క నీరు కూడా కాళేశ్వరం నుంచి సాగులోకి రాదని అంటున్నారు నిపుణులు. మరోవైపు, కాళేశ్వరంపై కేంద్ర పెద్దలు ఆరోపణలతోనే సరిపెడుతున్నారని.. తమ ప్రభుత్వం వచ్చాకే చర్యలు తీసుకుంటామని చెబుతుండడం లోపాయికారీ ఒప్పంద సంకేతానిస్తోందనే విమర్శలు ఎదురవుతున్నాయి.