CEO : ముంబైలో సినీ ఫక్కీలో జరిగిన ఓ కిడ్నాప్ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించగలిగారు. నగర శివార్లలోని గోరేగావ్ ప్రాంతంలో గల గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ అనే మ్యూజిక్ కంపెనీ సీఈఓ రాజ్ కుమార్ సింగ్ కి, మరో మ్యూజిక్ కంపెనీ సీఈఓ మనోజ్ మిశ్రాకు మధ్య కొంతకాలంగా ఆర్థిక సంబంధ వివాదాలు ఉన్నాయి. వీరి వ్యవహారంలో శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే ప్రకాష్ సుర్వే కుమారుడు రాజ్ సుర్వే కూడా జోక్యం చేసుకోవడం తో ఇది రాజకీయ రంగును పులుముకుంది. బుధవారం సుమారు 10 నుంచి 15 మంది గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ కార్యాలయంలోకి దూకుడుగా ప్రవేశించి రాజ్ కుమార్ సింగ్ ని బలవంతంగా తమ కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.
తనను దహిసార్ లోని ప్రకాష్ సుర్వే ఆఫీసుకు తీసుకువెళ్లారని, అక్కడ రాజ్ సుర్వే, మరికొందరు తనపై గన్ గురి పెట్టి పాట్నాకు చెందిన మనోజ్ మిశ్రాతో గల డబ్బుల విషయం సెటిల్ చేసుకోవాలని ఆదేశించారని బాధితుడు తెలిపాడు. మిశ్రాకు చెందిన ఆదిశక్తి ఫిల్మ్స్ కంపెనీకి తాను రూ. 8 కోట్లు అప్పుగా ఇచ్చానని, ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అతడిని కోరుతూ వచ్చానని ఆయన చెప్పాడు.
అయితే ఇందుకు మిశ్రా ఒప్పుకోక పోగా రాజ్ సుర్వే అండతో బెదిరింపులకు దిగడం మొదలు పెట్టాడని వెల్లడించాడు. చివరకు సుర్వే, మరికొందరు రెండు కార్లలో వచ్చి తనను కిడ్నాప్ చేశారని, తుపాకితో బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని చెప్పాడు.
అయితే రాజ్ కుమార్ ఆఫీసులో పని చేసే ఉద్యోగి ఒకరు పోలీసులకు జరిగిన ఘటన గురించి తెలియజేయగానే వారు కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి అతడిని రక్షించారు. రాజ్ కుమార్ ను వారు కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో పోలీసుల పని కూడా సులువయ్యింది. ఖాకీలు రాజ్ సుర్వే పైన, మనోజ్ మిశ్రా సహా సుమారు 10 మందిపై కేసు నమోదు చేశారు.