సీఎం జగన్ (CM Jagan)ను ఇంటికి పంపేందుకు యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. జగన్ అధికార గర్వాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు రెడీగా ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ పార్టీ జెండా పీకేయడం ఖాయమని తెలిపారు.
పీలేరులో ”రా..కదలి రా” బహిరంగ సభలో జగన్పై చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధం ప్రారంభమైందని చెప్పారు. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు. జగన్కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు.
విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ గురించి ప్రస్తావిస్తూ….. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధంగా పెడుతున్నారని నిప్పులు చెరిగారు. జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తాను రాయల సీమ బిడ్డనన్నారు. తనలో ఉన్నది రాయలసీమ రక్తమేనన్నారు.
హంద్రీనివాపై తాము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. జగన్ ఒక రూపాయి కూడా పెట్టలేదని విమర్శించారు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదని ఆరోపించారు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టామన్నారు. రాయలసీమను రతనాల సీమ చేసేందుకు ఏం చేయాలో తాను ఆలోచించాలని స్పష్టం చేశారు.