టీడీపీ(TDP) హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని.. ఇప్పుడు అవి ప్రపంచానికే ఆదర్శమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ‘కలలకు రెక్కలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ‘మహాశక్తి’ కింద ఐదు కార్యక్రమాలు తీసుకొస్తామని ప్రకటించారు.
మహాశక్తి కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీపం పథకం పేరుతో ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. 18-59 మధ్య వయస్సున్న మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే ఎన్టీఆర్ చొరవే అని చెప్పారు. టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలు తీసుకొచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. ఒకప్పుడు ఐటీ అని తానంటే అందరూ నవ్వారని.. ఇప్పుడు ఆ రంగంలో ప్రపంచమంతా మనవాళ్లు ఉన్నారని వివరించారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చామని అన్నారు. ఆడబిడ్డలకు రిజర్వేషన్లతో ప్రస్తుతం మగవారితో సమానంగా పని చేస్తున్నారని అన్నారు.
అయితే, మెరుగైన అవకాశాలు కల్పిస్తే మరింత ముందుకెళ్తారని చంద్రబాబు తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆచరణ సాధ్యం చేసే పార్టీ తెలుగుదేశం అని వివరించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ తీసుకొచ్చిన పథకాలతో ఎంతో మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని వివరించారు.
ఇంటింటికి మంచి నీటి కుళాయిలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకాలన్నీ మహిళల కోసం ప్రవేశ పెట్టామన్నారు. విద్యార్ధినుల కోసం ‘కలలకు రెక్కలు’ పేరుతో మరో పథకం ప్రవేశపెట్టినట్లు వివరించారు. పేద విద్యార్థినులు కలల సాకారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయనీ.. ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా మేం సహకరిస్తామని వెల్లడించారు.
మరోవైపు ప్రధాని మోడీ చెబుతున్న వికసిత్ భారత్ 2047 జరిగి తీరుతుందన్నారు చంద్రబాబు. జగన్ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఏ వ్యవస్థా సక్రమంగా లేదన్నారు. రైతులు, యువత, కార్మికులు నిరుద్యోగులు.. అన్ని వర్గాలు నలిగిపోయాయని మండిపడ్డారు. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలని చంద్రబాబు పేర్కొన్నారు.