ప్రతీ ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు తెచ్చి రైతన్నల కాళ్లు కడుగుతానని పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ వాగ్దానం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్(Makthal)లోని సంగంబండ(Sangambanda) వద్ద కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ చంద్‌రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు బార్డర్‌లో పనిచేసే ఆర్మీలాంటి వారని వ్యాఖ్యానించారు. వారి సహకారంతో పాలమూరు న్యాయ యాత్ర చేపట్టామని తెలిపారు. అందులో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మక్తల్ ప్రాంతంతో అవినాభావ సంబంధమున్న భట్టి విక్రమార్క డీప్యూటీ సీఎంగా, పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నీటి పారుదల మంత్రి అయ్యారని అన్నారు.
ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామన్నారు. అతిత్వరలో సంగంబండ పగలబోతోందని, ఈ ప్రాంతంలోని దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరు అందబోతుందని ఉద్ఘాటించారు. పాలమూరు అభ్యర్థిగా కాంగ్రెస్ పెద్దలు తనను పంపించారని, అందరూ ఆశీర్వదిస్తే ఈ ప్రాంతంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.