Chandrayaan-3 : చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ లో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసిన కీలక ఘట్టానికి ఇస్రో (Isro) సమాయత్తమవుతోంది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ కి అనువుగా ఈ వ్యోమనౌకను హారిజాంటల్ దిశ నుంచి అంటే అడ్డంగా ఉన్న స్థితి నుంచి నిలువుగా .. వర్టికల్ గా మార్చవలసి ఉంది. ఇది క్లిష్టమైన ప్రక్రియ అని, గతంలో చంద్రయాన్-2 ని ప్రయోగించినప్పుడు ఈ దశలోనే మనం వైఫల్యం చెందామని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ (S. Somanath) తెలిపారు. వర్టికల్ పొజిషన్ లోకి వ్యోమనౌకను తెచ్చేందుకు దశలవారీగా వివిధ ప్రక్రియలను చేబట్టవలసి ఉంటుందన్నారు.
చివరి దశలోనే గతంలో మనం సమస్య ఎదుర్కొన్నామన్నారు. చంద్రయాన్-3 వేగాన్ని సుమారు 1.68 కి.మీ. నుంచి మెల్లగా దిశను మారుస్తూ నిలువైన స్థితిలోకి తేవాల్సి ఉంటుంది.. జాబిల్లి ఉపరితలం మీద ఇది సాఫ్ట్ ల్యాండింగ్ కావాలంటే జీరో స్థాయికి తేవడం అత్యంత ప్రధానం.. ల్యాండర్ టచ్ డౌన్ టెస్ట్ లిమిట్ గంటకు 10.8 కి.మీటర్ల వర్టికల్ వెలాసిటీ.. ఈ ప్రక్రియ క్లిష్టతరమైనది అని ఆయన వివరించారు.
ఇక చంద్రుని చుట్టూ ఇదివరకే ఉన్న చంద్రయాన్-2 ఆర్బిటర్ తో ఈ వ్యోమనౌకలోని ల్యాండర్ మాడ్యూల్ ‘టు వే కమ్యూనికేషన్’ ని ఏర్పరచుకుంది. లోగడ చంద్రయాన్-2 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించి చంద్రుని దిశగా సాగినప్పటికీ కమ్యూనికేషన్ లో వైఫల్యం కారణంగా ఆ మిషన్ విఫలమైంది. అందువల్లే నాటి వైఫల్యాలను గుర్తుంచుకుని ఈ సారి మరింత అప్రమత్తంగా ఉండాల్సిఉంటుందని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.
ఇక చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలానికి చేరడానికి 48 గంటలకన్నా తక్కువ సమయమే ఉంది. బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిముషాలకు ఈ వ్యోమనౌక అక్కడ అడుగు పెట్టనున్న నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం 5 గంటల 20 నిముషాల నుంచి దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది. స్కూళ్ళు, కాలేజీలు కూడా దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరింది. కాగా-చంద్రయాన్-3 ని జాబిల్లి మీదికి దింపే సమయంలో అననుకూలమైన పరిస్థితి తలెత్తిన పక్షంలో మాడ్యూల్ ల్యాండింగ్ ని ఆగస్టు 27 కి వాయిదా వేయవలసి రావచ్చునని ఇస్రో సైంటిస్టు ఒకరు పేర్కొన్నారు.