ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina venugopala Krishna) అస్వస్థతకు గురైనట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంగళగిరి(Mangalagiri) సమీపంలో ఆయన అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరిగింది.
అంతేకాదు.. ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆయన కుమారుడు చెల్లుబోయిన నరేన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
తాజాగా, మంత్రి వేణుగోపాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోషల్ మీడియా టీమ్ ఓ ప్రకటన చేసింది. ‘మంత్రి వేణు ఆరోగ్యం బాగానే ఉంది.. గత కొన్ని రోజులుగా వరుసగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని సరైన నిద్ర లేని కారణంగా గ్యాస్ట్రిక్ ఇబ్బంది వచ్చింది. సాధారణ బాడీ చెక్అప్ నిమిత్తం విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం.’ అని పేర్కొన్నారు.
చాలా రోజుల నుంచి విశ్రాంతి లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. కొన్ని మీడియాలు చూపిస్తున్నట్లు గుండె జబ్బు కాదని.. కేవలం అస్వస్థతకు గురయ్యారని క్లారిటీ ఇచ్చారు. ‘మరేమీ కాదు.. ఎలాంటి వదంతులు నమ్మకండి.. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారు’ సోషల్ మీడియా టీమ్ ప్రకటించింది.