Telugu News » కారు డ్రైవర్‌ ఖాతాలో 9 వేల కోట్లు..ఇంతలో ఊహించని ట్విస్ట్‌!

కారు డ్రైవర్‌ ఖాతాలో 9 వేల కోట్లు..ఇంతలో ఊహించని ట్విస్ట్‌!

తన అకౌంట్‌లో అంత మొత్తం క్రెడిట్ అయినట్టు నిర్ధారించుకున్నాడు. కానీ, అతడి ఆనందం క్షణాల్లోనే ఆవిరయ్యింది.

by Sai
cab

అద్దెకు క్యాబ్ నడుపుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న ఓ యువకుడి బ్యాంకు ఖాతాకు ఏకంగా రూ.9 వేల కోట్లు జమయ్యాయి. తన ఖాతాలో రూ.9,000 కోట్ల జమైనట్టు మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రావడంతో అతడు షాకయ్యాడు. నిజమా? కాదా? అని నిర్దారించుకోడానికి తన స్నేహితుడికి అందులో నుంచి నగదు పంపాడు. దీంతో తన అకౌంట్‌లో అంత మొత్తం క్రెడిట్ అయినట్టు నిర్ధారించుకున్నాడు. కానీ, అతడి ఆనందం క్షణాల్లోనే ఆవిరయ్యింది. ఈ మొత్తాన్ని బ్యాంకు వెనక్కి తీసుకోవడమే కాదు.. స్నేహితుడికి పంపిన రూ.21 వేలు తిరిగి చెల్లించాలని కోరింది.

cab

విస్తుగొలిపే ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌.. చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె క్యాబ్ నడుపుతున్నాడు. అయితే, అతడికి తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు టీనగర్‌ బ్రాంచ్‌లో అకౌంట్ ఉంది. ఈ క్రమంలో సెప్టెంబరు 9 సాయంత్రం రాజ్‌కుమార్ మొబైల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. రూ.9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు అందులో ఉంది. ఒక్కసారి అంత మొత్తం తన ఖాతాకు జమకావడంతో అతడు విస్తుపోయాడు. ఈ సొమ్ము ఎలా వచ్చిందోనని తెలియక గందరగోళానికి గురయ్యాడు.

ముందు దీనిని ఓ కుంభకోణం అనుకున్నాడు. అది నిజమా? లేక ఎవరైనా కేటుగాళ్ల తనను బురిడీ కొట్టించడానికి పంపిందా? అని తెలుసుకునేందుకు తన అకౌంట్ నుంచి స్నేహితుడికి రూ.21 వేలు నగదు పంపాడు. తన ఖాతాలో వేల కోట్ల రూపాయాలు ఉన్నది నిజమేనని నిర్ధారణకు వచ్చి సంబరపడిపోయాడు. కానీ, ఇంతలోనే అతడి ఆనందం ఆవిరై
పోయింది. మిగిలిన నగదును తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు వెనక్కి తీసుకుంది. అనంతరం తూత్తుకుడిలోని హెడ్ ఆఫీసు నుంచి రాజ్‌కుమార్‌కు అధికారులు ఫోన్‌చేసి పొరపాటున తన ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయినట్లు తెలిపారు.

అంతేకాదు, తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని వారు కోరారు. దీంతో రాజ్‌కుమార్.. చెన్నై టీనగర్‌లోని బ్రాంచ్‌కు లాయర్‌ను తీసుకుని వెళ్లి మాట్లాడటంతో సమస్య పరిష్కారమైంది. స్నేహితుడికి పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం.

కాగా, ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల హరియాణాలోని ఓ రైతు బ్యాంకు ఖాతాకు కూడా రూ.200 కోట్లు జమ కావడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. గతేడాది చెన్నైకి చెందిన ఓ వ్యక్తి తన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాకు రూ.13 కోట్లు జమైనట్టు మెసేజ్ రావడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాంకు ఖాతా హ్యాక్ అయినట్టు అతడు అనుమానించగా.. విచారించిన పోలీసులు బ్యాంకులో సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల అలా జరిగినట్టు గుర్తించారు.

You may also like

Leave a Comment