ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయానికి(Chilkur Balaji Temple) భక్తులు పోటెత్తారు. ఆలయంలో గురువారం పుట్టమన్ను కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు స్వామివారికి ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా పంపిణీ చేశారు.
శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ చేశారు. అయితే ఈ ప్రసాదాన్ని కేవలం మహిళలకు మాత్రమే పంచుతారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఆ ప్రసాదం కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో భక్తులు తమ బైక్లు, కార్లను పార్క్ చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్తున్నారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా శ్రీరామ నవమి తర్వాత దశమి రోజు నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. శుక్రవారం స్వామివారికి గోపవాహన, హనుమాన్ వాహన సేవలు నిర్వహించనున్నారు.
ఈనెల 21(శనివారం) సూర్యప్రభ వాహనం, గరుడవాహనం సేవలు, అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకీసేవ, అర్ధరాత్రి 12గంటలకు స్వామివారి దివ్యరథోత్సవం ఊరేగింపు ఉంటుంది. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వహన సేవ, దోపేసేవ, పుష్పాంజలి సేవలు నిర్వహిస్తారు. చివరి రోజు 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.