Church : పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ జరాన్ వాలాలో అయిదు చర్చిలపై గుంపులు దాడులు చేసి విధ్వంసానికి పాల్పడ్డాయి. క్రైస్తవులైన రజార్ అమీర్ మసీహ్, అతని సోదరి రాకీ.. దైవ దూషణకు పాల్పడ్డారని, ఖురాన్ ను, మహ్మద్ ప్రవక్తను దూషించారని ఆరోపిస్తూ ముస్లిములు గుంపులుగా వెళ్లి వారి ఇంటిని కూడా కూల్చివేశారు. మైకుల్లో చేసిన ప్రచారంతో రెచ్చిపోయిన వీరు చర్చిలను టార్గెట్లుగా చేసుకుని దాడులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన క్రెస్తవులు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.
అయితే దాడులు జరుగుతుండగా పోలీసులు చూస్తూ మౌన ప్రేక్షక పాత్ర వహించారని పాకిస్తాన్ చర్చి ప్రెసిడెంట్ బిషప్ ఆజాద్ ఆరోపించారు. దాడికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరో బిషప్ మార్షల్.. ఈ హింసాత్మక ఘటనలపట్ల క్రైస్తవ గురువులు, చర్చి ఫాదర్లు, సామాన్య ప్రజలు కూడా తీవ్ర కలవరం చెందుతున్నారని అన్నారు.
మాజీ ఎంపీ అఫ్రాసిబ్ ఖటక్ సైతం… నిందితులను వెంటనే పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రార్థనా స్థలాలను పరిరక్షించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మతం పేరిట జరుగుతున్న ఇలాంటి దాడులను ప్రతివారూ ఖండించాలన్నారు. మైనారిటీలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఈ ఘటనలకు పాల్పడినవారిని సాధ్యమైనంతత్వరలో అరెస్ట్ చేస్తామని పాక్ ఆపధ్దర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ హామీ ఇచ్చారు.
పాక్ లో జరిగిన ఘటనపై అమెరికా తీవ్రంగా స్పందిస్తూ.. మతం పేరిట జరుగుతున్న దాడులను ఎవరైనా ఖండించాలని కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి శాంతియుత భావ ప్రకటనా స్వేచ్చకు మద్దతునివ్వాలని కోరుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. పాక్ ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు.హింస అన్నది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని, పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన ఘటనలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.