భారత హరిత విప్లవ పితామహుడు ఎంస్ఎస్ స్వామినాథన్ (MS Swamynathan) మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తీవ్ర సంతాపం తెలిపారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎంఎస్ స్వామి నాథన్ కృషి ఫలితమేనన్నారు. దేశీయ వ్యవసాయాన్ని వినూత్న పద్దతిలో గుణనాత్మక దశకు చేర్చిన మహనీయుడన్నారు. స్వామినాథన్ మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు.
స్వామినాథన్ చేసిన సిఫారసులు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని తెలిపారు. దేశంలో ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ చేసిన అద్బుతమైన ప్రయోగాల వల్ల దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా సాధించిందన్నారు. దేశ జనాభా అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ఆహార భధ్రత దిశగా జీవిత కాలం కృషి చేసిన వ్యక్తి స్వామి నాథన్ అన్నారు.
తెలంగాణలో వ్యవసాయ రంగాభివృద్ధికి రాష్ట్ర సర్కార్ చేపట్టిన కార్యాచరణను ఆయన పలుమార్లు కొనియాడారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా స్వామినాథన్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో రాష్ట్రానికి వారు రావడం, వారితో తాను రాష్ట్ర సచివాలయంలో భేటీ కావడం తాను మరచిపోలేనన్నారు.
అప్పుడు జరిగిన విస్తృత స్థాయి చర్చలో వారు పలు అమూల్యమైన సలహాలు ఇచ్చారన్నారు. రైతు సంక్షేమం కోసం, వ్యవసాయ రంగ సుస్థిరాభివృద్ధికోసం వారు చేసిన సిఫారసులు తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. ఒకప్పడు కరువు తాండవమాడిన తెలంగాణ నేలలో ఇప్పుడు బంగారు పంటలు పండుతుండటం వెనుక , వ్యవసాయ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ వెనుక ఆయన స్ఫూర్తి దాగుందన్నారు.
పాలకులు సరియైన దృష్టిని సారిస్తే దేశానికే తెలంగాణ విత్తన భాండగారంగా మారుతుందని చెప్పిన వారి ఆకాంక్షలను తమ ప్రభుత్వం నిజం చేసి చూపిందన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమాన్ని వ్యవసాయరంగాభివృద్ధిని గురించి తెలుసుకున్న స్వామి నాథన్ రాష్ట్రాన్ని ఆసక్తికనబరిచే వారని అన్నారు. వీలు చూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని చెప్పిన ఆయన ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు వెళ్లడం బాధను కలిగిస్తోందన్నారు.