కృష్ణా (Krishna), తుంగభద్ర నదులు ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండా ఆగం చేసి కరువు ప్రాంతంగా మార్చిన పార్టీ ఏది? అని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు. గద్వాలను గబ్బు పట్టించిన గబ్బు గాళ్లు ఎవరంటూ ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓటు వేసే ముందు పార్టీల చరిత్రను గమనించాలన్నారు.
గద్వాలలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. గద్వాల చరిత్ర చాలా గొప్పదన్నారు. ఈ గద్వాల ఊరు పేరు గురించి బయటి ప్రపంచంలో మాట్లాడితే విద్వత్ గద్వాల అని అనేవాళ్లని చెప్పారు.
ప్రసిద్ధి చెందిన తిరుపతి వెంకటకవులను సన్మానించిన ఘనత ఈ సంస్థానానికి ఉందన్నారు. ప్రపంచంలో ఉండే అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ తల్లి దేవాలయం ఒకటన్నారు. అందుకే జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లా అని పేరుపెట్టుకున్నామని చెప్పారు. జిల్లా పేరును తలుచుకున్నప్పుడల్లా అమ్మవారిని స్మరించుకున్నట్లు అవుతుందని ఆ పేరు పెట్టుకున్నామని అన్నారు.
తాను ఒక్కటే మనవి చేస్తున్నానన్నారు. ఎన్నికలు వస్తాయ్ పోతాయన్నారు. 30వ తేదీన ఓట్లు పడతాయని, ఎవరో ఒకరు గెలవాలన్నారు. ఇది ఎప్పుడూ జరిగేదన్నారు. మూడు పార్టీల నుంచి ముగ్గురు నేతలు నిలబడుతరపన్నారు. వారితో పాటు ఇంకెవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారు కావచ్చన్నారు.
బీఆర్‌ఎస్ నుంచి మన కృష్ణ మోహన్‌రెడ్డి ఉన్నడన్నారు. కాంగ్రెస్‌కు ఎవరో ఓ వ్యక్తి ఉంటాడన్నారు. బీజేపీకి ఎవరో ఒకరు వస్తరన్నారు. ఇక్కడ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల గుణం, గణాలను చూడాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి వారని, అసలు మంచేంది.. చెడేందని గమనించాలన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా పార్టీలు ఉన్నయన్నారు. కృష్ణమోహన్‌రెడ్డి వెనుక బీఆర్‌ఎస్ ఉందన్నారు. మిగతా అభ్యర్థుల వెనక ఆయా పార్టీలు ఉంటాయన్నారు.
ఆ పార్టీల చరిత్రను కూడా ప్రజలు చూడాలన్నారు. పార్టీ నడవడిక ఎలాంటిదనే విషయాన్ని పరిశీలించాలన్నారు. ఆ పార్టీ రైతులకు ఏం చేస్తుంది ? అని ఆలోచించాలన్నారు. పేద ప్రజల గురించి ఏం చేస్తారు ? ఏం ఆలోచన చేస్తారు ? అసలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయేందుకు ఏం వ్యూహాలు చేస్తారు ? అనే అన్ని విషయాలను ఆలోచించాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఆ పరిణితి, విచక్షణా జ్ఞానం ఓటర్లకు రావాలని సూచించారు. ఇప్పుడు పార్టీల చరిత్రలన్నీ మీ ముందు ఉన్నాయని తెలిపారు. ఎన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పరిపాలించిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. చరిత్రంతా ప్రజలకు తెలుసన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన ఎలా ఉందో.. ఈ పార్టీ ఎందుకు పుట్టిందో అందరికీ తెలుసన్నారు.