తెలంగాణ (Telangana) ఏర్పాటు కోసం 24 ఏండ్ల క్రితం పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించుకున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఉద్యమ సమయంలో మనల్ని ఎంతో మంది అవమానాలు, అవహేళన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఎట్లా వస్తదని అంతా ఎగతాళి చేశారన్నారు. అసలు రాష్ట్రం సాధ్యం అవుతుందా అని అంతా ప్రశ్నించారని పేర్కొన్నారు.
కేసీఆర్ అంటే బక్క పలచనోడు ఎవడో పిసికి చంపేస్తడు అని అంతా అన్నారని చెప్పారు. కానీ 14,15 ఏండ్లు పోరాటం తర్వాత యావత్ తెలంగాణ ఒక ఉప్పెనగా మారి గొంతెత్తితే దేశ రాజకీయ పరిస్థితి తలవంచి తెలంగాణ ఇచ్చిందన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ…. బీఆర్ఎస్ సర్కార్ వల్లే పాలేరు నియోజకవర్గానికి మోక్షం లభించిందని వెల్లడించారు. పాలేరుకు కేసీఆర్ వల్లే మోక్షం వచ్చిందని నిన్న మొన్నటి దాక అన్న నాలుకలే ఇప్పడు ఉల్టా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుకలు మాటలు మార్చవచ్చన్నారు. కానీ సత్యం మాత్రం మారదని తెలిపారు.
నిజం ఎప్పుడు నిజం లాగే ఉంటుందన్నారు. పాలేరుకు మోక్షం ఎవరి వల్ల వచ్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ రాక ముందు తెలంగాణలో ఎన్నో పార్టీలు రాజ్యమేలాయన్నారు. ప్రజలకు మంచినీళ్లు ఇవ్వాలన్న కనీస ఆలోచన కూడా ఆయా పార్టీలకు రాలేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాకే పాలేరకు మోక్షం వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చామన్నారు.
భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన రోజు మన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా వచ్చారన్నారు. పాలేరుకు మీరు ఎందుకు వస్తున్నారని ఆయన్ని తాము అడిగామన్నారు. దానికి తనది కూడా పాలేరు నియోజకవర్గమేనని మహేందర్ రెడ్డి అన్నారన్నారు. 45 ఏండ్లలో 40 ఏండ్లు పాలేరు ప్రాంతం కరువు కాటకాలకు గురైందని మహేందర్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు మీరు నీళ్లు ఇస్తుంటే సంతోషంగా ఉందన్నారని చెప్పారు.
కాంగ్రెస్ మోసం చేసిన సందర్భంలో తాను ‘కేసీఆర్ శవయాత్రనా… తెలంగాణ జైత్ర యాత్రనా’అని ఆమరణ నిరహార దీక్షకు దిగానన్నారు. అప్పుడు తనను అరెస్టు చేసి ఇదే ఖమ్మం జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అనేక సారలు మోసాలు చేశారని మండిపడ్డారు. మాటలతో నమ్మించారని ఫైర్ అయ్యారు. వాటన్నింటినీ అధిగమించి అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు.
రైతు బంధు పదాన్ని పుట్టించిందే తామన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. దేశంలో అత్యధిక ధాన్యం పండించే రెండో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ రైతులు 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండిస్తున్నారని చెప్పారు. 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని అన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు పూర్తిగా నిలిచిపోతాయన్నారు.