కాంగ్రెస్ (Congress) సర్కార్ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే దళితుల్లో ఇప్పటికీ ఇంకా పేదరికం ఎందుకు ఉండేదని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు. దళితులను ఒక ఓటు బ్యాంకులాగా కాంగ్రెస్ వాడుకుందన్నారు. అమ్మను చూడు.. మాకు ఓటు వేయండని ఓటు బ్యాంకుగా వాడుకున్నారని తెలిపారు. అంతే కానీ దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పాటుపడలేదని ఫైర్ అయ్యారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటగా సంక్షేమాన్ని చూసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ స్థిరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామన్నారు. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు కూడా మీకు వస్తదన్నారు.
నీటి తీరువా రద్దు చేశామన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్ సర్కార్ అన్నారు. రైతు మరణిస్తే రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడన్నారు. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని చెబుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి తెలివి తక్కువతనం ఏందంటే. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టాలి, 3 గంటల కరెంట్ ఇవ్వాలంటున్నారు.
కరెంట్ రాంగనే అందరూ వత్తాలి దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు పటాకులు పేలినట్లు పేలుతాయన్నారు. అటు సబ్ స్టేషన్లు కూడా పేలిపోతాయన్నారు. అంతంత లోడ్ తీసుకుంటాయా? ఇప్పుడున్న తీగలు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఇదంతా కొంపలగుత్త వ్యవహారమని మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రైతులు పండించిన ధాన్యన్నంతా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయని అన్నారు. దీంతో రైతుల ముఖాలు ఆనందంతో కళకళలాడుతున్నాయన్నారు. ఇంకో పది, పదిహేను ఏండ్లు ఇస్తే రైతులకు ఆ తర్వాత పెట్టుబడి కూడా ఇవ్వాల్సిన అసవరం ఉండదన్నారు. ఆ తర్వాత సొంత పెట్టుబడితో రైతులే బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారన్నారు.
ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తానని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్నారు. అది భూమతానా..? భూమేతనా..? అని ఫైర్ అయ్యారు. రైతుల భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకూడదని, పకడ్బందీగా ధరణి తీసుకు వచ్చామన్నారు. ఇప్పుడు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, నిమిషాల్లోనే మ్యుటేషన్ అయిపోతుందన్నారు. ఆన్‌ది స్పాట్ పట్టా చేతికి వస్తోందన్నారు.
ఇక ధరణి ద్వారా రైతుబంధు నేరుగా మీ ఖాతాలోకి వస్తోందన్నారు. మరి ధరణి బంద్ చేస్తే రైతుబంధు ఎలా వస్తదని ప్రశ్నించారు. పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని మండిపడ్డారు. మళ్లీ పైరవీకారులను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ఉందన్నారు. ఇవాళ లంచం ఇవ్వకుండా, ఎలాంటి దరఖాస్తు పెట్టకుండా నేరుగా మీ వ్యవసాయానికి పెట్టుబడి వస్తోందన్నారు. ఆలోచించి ఓటు వేయకపోతే పదేండ్ల పాటు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు.
దళితులు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనే ఆలోచనతోనే హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళితబంధు అమలు చేశామని అన్నారు. ఇప్పుడు అక్కడ దళిత వాడలు.. దొరల వాడల మాదిరిగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ దెబ్బతో దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలుగా మారుతాయన్నారు. ఎవడో ఎల్లయ్య గెలిస్తే వచ్చేదేమి లేదన్నారు. ఆనంద్ గెలిస్తే ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబం అవుతుందన్నారు.