తెలంగాణ ( Telangana )లో ఎన్నికల (Election) నగారా మోగింది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా పార్టీలన్నీ ఓటర్ల దగ్గరకు వేళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఓటర్లను ఎలా అయినా ప్రసన్నం చేసుకోవాలని ప్రణాళికలను రచిస్తున్నాయి. ఈ మేరకు రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం లాంటి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో అధికార పక్షం కూడా ఎన్నికల శంఖారావం పూరిచేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో భారీ బహిరంగ సభలతో ప్రజలకు చేరువ కావాలని చూస్తోంది. ఈ నెల 15న సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 15 న మొదటి బహిరంగ సభను హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఆ తర్వాత 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో , 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు. 15న జిల్లా పర్యటనకు వెళ్లే ముందు అదే రోజు బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజలకు చేరువయ్యేందుకు ఏం చేయాలనే అంశాలపై అభ్యర్థులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.
ఆ సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను సీఎం కేసీఆర్ అందజేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. మరో వైపు నవంబర్ 9న ఆయన గజ్వేల్, కామా రెడ్డి నియోజక వర్గాల నుంచి నామినేషన్ వేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.