ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ సారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని లేఖలో కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ 2014లో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి పంపిందన్నారు.
కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే విధంగా చట్ట సభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ 2023లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. అందువల్ల ఈ సమావేశాల్లో ఆ రెండు బిల్లుల ఆమోదానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు.
మరోవైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో ఆయన చర్చించారు. ఈ సందర్బంగా పార్టీ ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సభ్యులకు ఆయన సూచించారు. ఈ విషయంపై ఉభయ సభల్లో గళం వినిపించాలని సభ్యులకు ఆయన సూచించారు.
ఇక ఈ సమావేశాల్లో కేంద్రం ఏదైనా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తానే ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తానని ఎంపీలతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలో జమిలీ ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సందర్బంలో ఆయన జమిలీ ఎన్నికల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వచ్చినా లేదా వేరు వేరుగా నిర్వహించినా తమ పార్టీదే విజయమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ విజయంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.