అధిష్టానం పెద్దలను కలవడానికి ఢిల్లీ(Delhi) వెళ్లిన తెలంగాణ(Telangana) సీఎం(CM) రేవంత్‌రెడ్డి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకోనున్నారు. అసెంబ్లీలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది.
2014 నుంచి ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమయ్యారు. దీంతో సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి.
గత సమావేశంలో విమర్శలు, ప్రతి విమర్శలతో సభ హీటెక్కింది. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పదవుల భర్తీ, లోక్ సభ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
నాలుగున్నరేళ్లుగా ఎంపీగా పనిచేసిన రేవంత్‌రెడ్డి తోటి ఎంపీలతో విందులో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని రేవంత్ తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఏపీ భవన్ మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం దృష్టి సారించారు.